నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఫీచర్‌: ఇక ఆన్లైన్ స్ట్రీమింగ్ కి చెక్..

29

చిన్నారులు, పెద్దలు అనే తేడాలేకుండా అందరినీ ఆకర్షించేలా కంటెంట్‌ను రూపొందించడంతో ఓటీటీల మధ్య పోటీ బాగా పెరిగిపోయింది. దీంతో గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఒక వెబ్‌ సిరీస్‌ ఓపెన్‌ చేసి ఒక ఎపిసోడ్‌ తర్వాత మరోటి ఇలా మొత్తం వెబ్‌ సిరీస్‌ను ఒకే రాత్రిలో చూసేస్తుంటారు కొందరు. ఇలా చేయడం వల్ల నిద్ర పాడవడంతో పాటు కళ్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.

దీనికి చెక్ పెట్టడానికి నెట్‌ఫ్లిక్స్‌ ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై నెట్‌ఫ్లిక్స్‌ను సెట్‌ చేసుకున్న సమయానికి స్ట్రీమింగ్‌ ఆగిపోయేలా చేసుకునే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘స్లీప్‌ టైమర్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ద్వారా వినియోగదారులు 15,30,45 నిమిషాలు లేదా షో పూర్తయ్యేవరకు సమయం సెట్‌ చేసుకోవచ్చు.

సెట్‌ చేసిన సమయానికి స్ట్రీమింగ్‌ ఆగిపోతుంది. ముఖ్యంగా చిన్నారులను కంట్రోల్‌ చేయడానికి ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత టీవీలు, ల్యాప్‌టాప్‌, ఇతర గ్యాడ్జెట్లలోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.