13 ఏళ్ళ బాలిక కిడ్నాప్, పెళ్లి, బలవంతపు మతమార్పిడి

171

పాకిస్తాన్ లోని సింధ్ లో కవితా బాయి అనే 13 ఏళ్ళ హిందూ బాలికను ఓ వ్యక్తి ఎత్తుకుపోయి ఆమెను బలవంతంగా ఇస్లామ్ మతంలోకి మార్చాడు. అనంతరం మత గురువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. సింధ్ లోని కాష్మోర్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. బాహల్కని అనే గిరిజన తెగకు చెందిన ఈ వ్యక్తి ఈమెను ఇటీవల అపహరించుకుపోయి ఇలా ఆమె ఇష్టానికి విరుద్ధంగా మత మార్పిడి చేసాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ నెల 8 న అయిదుగురు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి తన కూతుర్ని కిడ్నాప్ చేశారని కవితా బాయి తండ్రి పేర్కొన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. ఆయన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ ఫిర్యాదు చేశారు. కవితా బాయిని కోర్టులో హాజరు పరచగా ఆమె 18 ఏళ్ళ యువతిగా కనిపించిందని వార్తలు వచ్చాయి. ఆమె వాంగ్మూలం తీసుకున్న అనంతరం ఆమెను కాష్మోర్ జిల్లా నుంచి గోట్నీ అనే మరో ప్రాంతానికి తరలించారు.

కాగా తన తలిదండ్రులకు ఈ వ్యక్తితో తన పెళ్లి ఇష్టం లేదని, తనకు కోర్టు రక్షణ కల్పించాలని కవితా బాయి కోరినట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం తాజాగా ఓ కేసు నమోదు చేశారు. మైనర్ బాలికకు, పెద్దవాడైన వ్యక్తికి మధ్య పెళ్ళిజరిగిన పక్షంలో అది ఆ వ్యక్తి నేరమవుతుందని, అతనికి మూడేళ్ళ జైలు శిక్ష పడుతుందని వారు అంటున్నారు. అటు- కవితా బాయి వయస్సు ఎంతో నిర్ధారించేందుకు డీఎన్ఎ టెస్ట్ నిర్వహించనున్నారు.