ఆర్మీలో ఉద్యోగం ఇక కల్ల..! రైల్వేస్టేషన్‌ విధ్వంస కారకులకు యావజ్జీవ లేదా మరణ శిక్ష పడే అవకాశం

వారంతా ఆర్మీ ఉద్యోగప్రయత్నంలో సగం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినవారే. తమ పరీక్షను రద్దు చేశారని ఆవేశంలో చేసిన తప్పిదం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితిలో ఇరుక్కున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసరచనకు పూనుకున్న వారిపై జీఆర్పీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఇరుక్కుంటే ఆర్మీ ఉద్యోగాలు చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకూ ఇబ్బందులు తప్పవు. ఈ ఘటనలో  నలుగురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి.

వీరు ఇదివరకటిలా పరుగెత్తడం, హైజంప్‌, లాంగ్‌జంప్‌ లాంటివి చేయడం కష్టమేనని వైద్యులు చెబుతున్నారు. పైగా రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినందుకు వీరిపై మాత్రం ఐపీసీ, భారతీయ రైల్వే చట్టం(ఐఆర్‌ఏ)లోని 14 సెక్షన్లను ప్రయోగించారు. ఐఆర్‌ఏ సెక్షన్లు చాలా కఠినంగా ఉంటాయి. ఇవి చాలా వరకు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లే. ఐఆర్‌ఏ 150(హానికరంగా రైలును ధ్వంసం చేయడం) సెక్షన్‌ కింద నేరం రుజువైతే యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశముంది.

రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. నేను చచ్చేలోపు ఒక్క పోలీస్ నైనా చంపుతా..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్ మంటలు తెలంగాణను సైతం తాకాయి. బస్సులపై ఆర్మీ అభ్యర్థులు రాళ్లు రువ్వారు. రెండు బోగీలకు నిప్పంటించారు. మొదటి మూడు ఫ్లాట్‌ఫాంలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మూడు ఫ్లాట్‌ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. మొత్తానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ రణరంగంగా మారింది. ఇందులో ఒకరు మృతి చెందగా 7 మంది పరిస్తితి విషమంగా ఉంది.

అగ్నిపథ్‌ను రద్దు చేసి ఆర్మీ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్‌ వద్దనున్న బస్టాండ్‌కు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడున్న ఆందోళనకారులంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరుగులు తీసి అక్కడ నిలిచి ఉన్న రైళ్లపై విద్యార్థులు రాళ్లు రువ్వుతున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ప్రయాణికులంతా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులు పట్టాల మధ్యలో నిప్పుపెట్టారు. వేలాది మందిగా ఉన్న యువకులను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పరిస్థితి పోలీసుల చేయి దాటి పోయింది. రైళ్ల అద్దాలను ధ్వంసం చేస్తుంటడంతో ఏమీ చేయలేక పోలీసులు చూస్తూ ఉండిపోయారు.

వెనుకకు తగ్గని అభ్యర్ధులు మాత్రం దేశం కోసం చవడానికి సిద్ధం అయ్యం.. కానీ ఇక్కడ చావవలసి వస్తుంది.. కానీ చచ్చేలోపు ఒక్క పోలీస్ నైనా చంపే చస్తాం అంటూ తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జస్టిన్‌ బీబర్‌ ముఖానికి పక్షవాతం.. వీడియో షేర్‌ చేసిన పాప్‌ సింగర్‌

కెనడియన్‌ ప్రముఖ పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ ముఖానికి పక్షవాతం వచ్చింది. రామ్సే హంట్ సిండ్రోమ్ కారణంగా కుడివైపు ముఖంలోని నరాలు చచ్చుబడిపోవడంతో ఆయన పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు. బీబర్‌ మరికొన్నిరోజుల పాటు వరల్డ్‌ టూర్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆయన మొదట కాన్సర్ట్‌ టొరెంటోలో ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు దాన్ని క్యాన్సిల్‌ చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనిపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో బీబర్‌ స్పందించారు. తనకు ఆరోగ్యం సరిగాలేకపోవడంతోనే కాన్సర్ట్‌ని రద్దు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు.

‘‘చెవి, ముఖంలోని నాడీ వ్యవస్థపై రామ్సే హంట్ సిండ్రోమ్ ఎటాక్‌ చేయడం వల్ల నా ముఖానికి పక్షవాతం వచ్చింది. మీరు సరిగ్గా చూసినట్లైతే నా కుడికన్ను ఆర్పడానికి వీలు కావట్లేదు. కాన్సర్ట్స్‌ రద్దు కావడంతో అసహనానికి గురైనవాళ్లకి చెప్పేది ఒక్కటే.. ‘‘ప్రస్తుతానికి ఫిజికల్‌గా ఫిట్‌గా లేను. ఇది కాస్త తీవ్రంగానే పరిగణించాలి. ఇప్పటికైనా కాస్త నిదానించమని నా శరీరం చెబుతున్నట్లు ఉంది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొంతకాలం విశ్రాంతి తీసుకుని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని భావిస్తున్నా’’ అని ఆయన తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Justin Bieber (@justinbieber)

10 మంది తినేది ఒక్కడే తింటాడంటూ ఫంక్షన్లకు కూడా పిలవని బంధువులు..

30 సంవత్సరాల రఫీక్ అద్నాన్ అరుదైన వ్యాధి బులిమియా నెర్వోసా తో బాధపడుతున్నాడు. పరిమితులు లేకుండా ఆహారం తీసుకోవడం అనేది ఈ వ్యాధి లక్షణం. రఫీక్ ప్రతిరోజూ 3 కిలోల బియ్యం, 4 కిలోల గోధుమ పిండితో చేసిన రోటీలు, 2 కిలోల మాంసం, 1.5 కిలోల చేపలు తింటాడు. వాటితో పాటు రోజులో మూడుసార్లు ఒక లీటరు పాలు తాగుతాడు. మొత్తం మీద రఫీక్ రోజుకు 14-15 కిలోల ఆహారాన్ని తీసుకుంటాడు. రఫీక్ ప్రస్తుత బరువు 200 కిలోలు. పుట్టినప్పటి నుంచి రఫీక్ అధిక ఆహారం తీసుకునేవాడు.

రఫీక్‌కు సరిపడే వంట చేయడం ఒక మనిషికి సాధ్యం కాదు. అందుకే రెండు వివాహాలు చేసుకున్నాడు. భార్యలిద్దరూ కలిసి రఫీక్‌కు సరిపడే వంట చేసి పెడుతుంటారు. ఊబకాయం కారణంగా రఫీక్‌కు సంతానం కలగలేదు. రఫీక్ ప్రస్తుతం నడవడానికి కూడా చాలా ఇబ్బందిపడుతున్నాడు. సాధారణ బైక్‌లు అతని బరువు మొయ్యలేవు కాబట్టి బుల్లెట్‌నే వాడుతుంటాడు. అది కూడా అప్పుడప్పుడు రఫీక్‌ను మోయలేక ఇబ్బంది పెడుతుంటుంది. రఫీక్ తీసుకునే ఆహారం గురించి తెలిసి బంధువులు, స్నేహితులు అతడిని శుభకార్యాలకు పిలవడానికి కూడా భయపడుతుంటారు. రఫీక్ తన గ్రామంలో సంపన్న రైతు. అందువల్ల అతనికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ లేదు.

రఫీక్‌కు చికిత్స అందించే డాక్టర్ మృణాల్ రంజన్ మాట్లాడుతూ.. `రఫీక్‌కు బులిమియా నెర్వోసా అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా తింటుంటారు. ఈ వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. లేదంటే రోగి ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. చాలా నెమ్మదిగా అతను తీసుకునే ఆహారం పరిమాణం తగ్గించుకుంటూ రావాల`ని చెప్పారు.

ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా

మాలావత్‌ పూర్ణ అరుదైన ఘనత సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వత శిఖరం (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7–సమ్మిట్‌ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన ‘యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా’గా రికార్డు సృష్టించింది. పూర్ణ మే 18న ఇండియా నుంచి బయల్దేరి, మే 19న అలస్కాలోని ఎంకరేజ్‌ నగరానికి చేరుకుంది. ఈ పర్వతారోహణలో పూర్ణతోపాటు మనదేశం నుంచి మరో నలుగురు సభ్యులున్నారు.

మే 23న బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నవారు శిఖర అధిరోహణ ప్రారంభించి, ఈనెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్‌ శేఖర్‌ బాబు ధ్రువీకరించారు. శిఖరం నుంచి కిందికి వస్తూ పూర్ణ శాటిలైట్‌ ఫోన్‌ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఈ యాత్రకు స్పాన్సర్‌ చేసిన ఏస్‌ ఇంజనీరింగ్‌ అకాడమీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వైవీ గోపాలకృష్ణమూర్తి, తన గురువు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌(వీఆర్‌ఎస్‌), సహకరించిన హైదరాబాద్‌ బీఎస్‌బీ ఫౌండేషన్‌ చైర్మన్‌ భూక్యా శోభన్‌బాబులకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది.

పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన ‘ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌’ సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7–సమ్మిట్స్‌ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది. దెనాలి పర్వతారోహణలో పూర్ణతోపాటు అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్‌ బజాజ్, ఆయన కుమార్తె దియా బజాజ్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్‌ వర్మ కూడా ఉన్నారు.

ప్రపంచ తొలి 10 పాఠశాలల్లో ఇండియా నుండి ఐదు పాఠశాలలకు స్థానం

ప్రపంచంలో ఉత్తమ పాఠశాలల ఎంపిక కోసం షార్ట్‌లిస్టు చేసిన స్కూళ్ల జాబితాలో ఇండియా నుంచి ఐదు పాఠశాలలకు స్థానం దక్కింది. వివిధ కేటగిరీల్లో మొదటి 10 పాఠశాలల్లో 5 ఇండియాకు చెందిన పాఠశాలలే కావడం విశేషం. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లోని ‘టీ4 ఎడ్యుకేషన్‌’ అనే డిజిటల్‌ మీడియా వేదిక వివిధ కేటగిరీల్లో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేస్తోంది.

యాక్సెంచర్, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, టెంపుల్టన్‌ వరల్డ్‌ చారిటీ ఫౌండేషన్, లేమన్‌ ఫౌండేషన్‌ సహకారంతో 2,50,000 డాలర్లతో ‘బెస్టు స్కూల్‌ ప్రైజెస్‌’ను ఏర్పాటు చేసింది. ఇన్నోవేషన్‌ కేటగిరీలో ముంబైలోని ఎస్‌వీకేఎమ్స్‌ సీఎన్‌ఎమ్‌ స్కూల్, ఢిల్లీలోని ఎస్‌డీఎంసీ ప్రైమరీ స్కూల్‌కు టాప్‌10లో స్థానం దక్కింది. సామాజిక భాగస్వామ్యం  విభాగంలో ముంబైలోని ఖోజ్‌ స్కూల్, పుణేలోని పీసీఎంసీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ చోటు దక్కించుకున్నాయి.

 అవరోధాలను ఎదుర్కొని నిలిచిన స్కూళ్ల జాబితాలో హౌరాలోని సమారిటన్‌ మిషన్‌ హైస్కూల్‌కు స్థానం లభించింది. మొత్తం ఐదు కేటగిరీలు ఉండగా, ఒక్కో కేటగిరీలో ఒక అత్యుత్తమ పాఠశాలను ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి ఎంపిక చేయనున్నారు. బహుమతి కింద ఒక్కో స్కూల్‌కు 50,000 డాలర్ల చొప్పున నగదును అందజేస్తారు.

కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ సింగర్ కేకే.. లైవ్ షోలో గుండెపోటు..

ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు కేకే (53) పేరుతో ప్రసిద్ధి గాంచిన కృష్ణకుమార్‌ కున్నాథ్‌ కోల్‌కతాలోని నజురుల్‌ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన అనంతరం హోటల్‌కు చేరుకున్న కేకే అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే  అతడిని నగరంలోని సీఎంఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్లు పరీక్షించి కేకే మరణించినట్లు ధ్రువీకరించారు. కేకే మరణించడానికి కంటే ముందు తను ప్రదర్శన ఇస్తున్న పోస్టులను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఢిల్లీలో జన్మించిన కేకే 1999లో బాలీవుడ్‌ చిత్రం పాల్‌ సినిమాతో పరిచయమయ్యారు. అనంతరం పలు హిట్‌ సాంగ్స్‌ పాడి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా  తనదైన ముద్ర వేసుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో పాటలు పాడారు.

కేకే మృతితో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన గాయకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాడని సామాజిక మాధ్యమాల్లో సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రధాని మోదీ, క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌, నటుడు అక్షయ్‌కుమార్‌తో సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

‘‘కేకే పాటలు అన్నిరకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. అన్ని వయసుల వారిని అలరిస్తాయి. ఆయన పాడిన పాటలతో కేకేను ఎప్పటికీ గుర్తించుకుంటాం.  కేకే కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

7వ ఈట్‌ రైట్‌ రైల్వే స్టేషన్‌గా విశాఖ రైల్వే స్టేషన్‌

 విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దొరికే ఆహార పదార్థాలను ఎటువంటి సందేహం, భయం లేకుండా తినేయొచ్చని ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫై చేసింది. విశాఖ రైల్వే స్టేషన్‌కు ఈట్‌ రైట్‌ రైల్వే స్టేషన్‌ గుర్తింపు ఇస్తూ ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది.

ఇలా గుర్తింపు పొందిన దేశంలోని 7వ రైల్వే స్టేషన్‌గా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నిలిచింది. గతంలో చండీగఢ్‌ రైల్వే స్టేషన్, ఢిల్లీలోని ఆనంద్‌ విహార్, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ రైల్వే స్టేషన్, ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్, వడోదర, భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్లు ఈ గుర్తింపు పొందాయి.

రాష్ట్రంలోనే తొలి ఎకో బ్రిడ్జ్‌

తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడి నుంచే తెలంగాణలోని అడవుల్లోకి పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్‌.

ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్‌పూర్‌ –విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కాబోతోంది. నాలుగు వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ.. వాటి మనుగడకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 150 మీటర్ల పొడవుతో ఎకో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు.

అంటే..వన్యప్రాణులు రాకపోకలు సాగించే సమయంలో జాతీయ రహదారిని దాటేందుకు సహజ సిద్ధ వాతావరణం కల్పిస్తూ నిర్మించే వంతెన అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల పరిరక్షణలో మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ తరహా నిర్మాణం తెలంగాణలోనే మొదటిది కానుండటం విశేషం.

ఐపీఎల్‌ చాంపియన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ అరుదైన ఘనత

తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచిన ఘనత ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్‌ మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌కు హాజరైన 1,04,859 మందితో మైదానమంతా హోరెత్తగా, గుజరాత్‌ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. మే 29 (ఆదివారం) జరిగిన ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించి గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌–2022 విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా,  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 45 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

Latest

error: