ఎయిర్‌టెల్ యూజర్లకు హెచ్చరిక.. ఈ లింకులు ఓపెన్ చేయొద్దు..!

37

టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ తమ యూజర్లను సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్త ఉండాలంటూ హెచ్చరించింది.  ఇటీవల యూజర్ల కేవైసీ అప్ డేట్ పేరుతో కొన్ని లింకులు ఎస్ఎంఎస్ రూపంలో ఎయిర్ టెల్ యూజర్ల ఫోన్లకు వస్తున్నాయి. ఎయిర్ టెల్ కేవైసీ అని పొరబడి లింకు ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు.

కెవైసి అప్ డేట్ చేసుకోకపోతే.. మీ మొబైల్ సర్వీసు నిలిచిపోతుందని మెసేజ్ లు పంపుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఎయిర్ టెల్ యూజర్లను కేవైసీ విషయంలో హెచ్చరించిన ఫొటోను హైదరాబాద్ సిటీ పోలీసులు ట్వీట్ చేశారు. ఎయిర్ టెల్ కెవైసి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్ లైన్, ఫోన్ కాల్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ ఎవరైనా చెబితే నమ్మొద్దని, బ్యాంకు వివరాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే రిస్క్ ఉందని తెలిపారు.

మోసగాళ్లు పంపిన లింక్ పై క్లిక్ చేసి కేవైసీ అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే సరాసరి బ్యాంకు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సిందిగా అడుగుతారు. ముందుగా రూ. 10 చెల్లిస్తే మొబైల్ సేవలు కొనసాగుతాయని నమ్మబలుకుతారు. నేరగాళ్లు చెప్పినట్టు లింకులు క్లిక్ చేస్తే అంతే.. అకౌంట్లో నగదుతో పాటు విలువైన మీ వ్యక్తిగత వివరాలు సైబర్ మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్టే.. అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.