ఆనందయ్య ఔషధం పంపిణీకి ఏపీ హైకోర్టు అనుమతి

18

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్‌ మినహా మిగిలిన అన్ని రకాల మందులకు అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌ మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం…‘కే’ అనే మందును కమిటీ ముందు చూపించలేదనే కారణంతో నిరాకరించింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హానీ లేదని నివేదికలు తేల్చాయి. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై నివేదికలు రావడానికి మరో 2–3 వారాల సమయం పడుతుందని సమాచారం. అయితే ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి ఎలాంటి నిర్ధారణలు లేవని నివేదికల్లో పేర్కొన్నారు. అందువల్ల ఆనందయ్య మందు వేసుకున్నా ఇతర మందులను ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని స్పష్టం చేసింది.

అదేవిధంగా ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్‌ పాజిటివ్‌ రోగులు కృష్ణపట్నం రావొద్దని ప్రభుత్వం కోరింది. వారి బదులుగా కుటుంబసభ్యులు, ఇతరులెవరైనా వచ్చి మందు తీసుకోవాలని సూచించింది. మందు పంపిణీ సందర్భంలో కొవిడ్‌ ప్రోటోకాల్‌ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ప్రభుత్వం పలు నిబంధనలు విధించినా.. మొత్తానికి ఆనందయ్య మందుపై సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.