వంటింట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి రూ.20 లక్షల రూపాయలను కాల్చేసిన భార్యాభర్తలు

54

రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహీ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల డబ్బును తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే దీంట్లో తన తప్పేమీ లేదనీ, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాను ఈ డబ్బును తీసుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో పర్వత్ ను పట్టుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి ఏసీబీ అధికారులు బయలు దేరారు.

ఈ విషయం గురించి ఇంట్లోనే ఉన్న తహసీల్దార్ కు ముందుగానే ఎవరో సమాచారం ఇవ్వడంతో బయట గడియ పెట్టి బీరువాలో ఉన్న కట్టలకొద్దీ డబ్బును అతడి భార్య సహాయంతో గ్యాస్ స్టవ్ మీద కాల్చేయడం మొదలు పెట్టాడు. ఇలా మొత్తం మీద ఏకంగా రూ.20 లక్షల రూపాయల నోట్ల కట్టలను కాల్చేశాడు. ఈ లోపే ఏసీబీ అధికారులు అతడి ఇంటికి చేరుకున్నారు. బయట నుంచి అంతా చూస్తూ డబ్బును కాల్చేయొద్దని హెచ్చరించారు.

తహశీల్దార్ వినకపోయేసరికి ఏసీబీ అధికారులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఈ ఘటనలో 20 లక్షల రూపాయలు కాలి బూడిదైపోగా, కేవలం లక్షన్నర రూపాయలను మాత్రమే అతడి నుంచి స్వాధీనం చేసుకోగలిగారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.