ఢిల్లీలో సినీఫక్కీలో మాఫియా గ్యాంగ్ దాడి… పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడ్ని…

39

పోలీసులకు చిక్కిన ముఠా సభ్యుడ్ని విడిపించేందుకు ఇతర గ్యాంగ్ స్టర్లు దాడులకు పాల్పడడం అనేక సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది. కుల్ దీప్ అలియాస్ ఫజ్జా ఓ కరుడగట్టిన నేరస్తుడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జతిందర్ గోగి ముఠాలో కుల్ దీప్ కీలక సభ్యుడు. అతడ్ని గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే అనారోగ్యం బారినపడడంతో పోలీసులు ఎస్కార్టు సాయంతో కుల్ దీప్ ను ఢిల్లీ జీటీబీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ విషయం జతిందర్ గోగి గ్యాంగ్ కు తెలియడంతో.. పోలీసుల కంటే ముందే ఆసుపత్రి వద్దకు చేరుకుని వాహనాల్లో కాపు కాశారు. కుల్ దీప్ ను తీసుకువస్తున్న పోలీసు వాహనం ఆసుపత్రి వద్దకు రాగానే ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.

పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ఒక గ్యాంగ్ స్టర్ మరణించాడు. మరో గ్యాంగ్ స్టర్ గాయపడ్డాడు. అయితే, ఈ ఘటనలో జతిందర్ గ్యాంగ్ అనుకున్నది సాధించింది. పోలీసు కస్టడీలో ఉన్న కుల్ దీప్ ను విడిపించుకుని అక్కడ్నించి పరారైంది. ప్రస్తుతం ఈ గ్యాంగ్ కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.