
టాలీవుడ్ ప్రముఖ నటుడు చలపతి రావు (78) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు.
కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944 మే 8న జన్మించారు. చలపతి రావుకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు. కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. చలపతిరావు 1200కు పైగా సినిమాల్లో నటించారు. ఏడు సినిమాలను నిర్మించారు. ఇండస్ట్రీలో చలపతి రావుని అందరూ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు.
ఆయన నటించిన మొదటి చిత్రం గూఢచారి 116. చివరి చిత్రం ఓ మనిషి నీవేవరు. చలపతిరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకుంటున్నారు.