
దక్షిణ ఢిల్లీ ద్వారక ప్రాంతంలో స్వీట్ షాప్ రన్ చేస్తున్న ఓ వ్యక్తికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల క్రితం భార్య మరణించింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయి ఎప్పుడూ కూడా ఏదో ఆలోచనలో ఉంటూ గడిపేవాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం పొరుగువారితో గొడవపడ్డాడు. దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి చేతి మీద కత్తితో కోసుకున్నాడు. అది గుర్తించిన అమెరికా ఫేస్బుక్ కార్యాలయం అధికారులు వెంటనే ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేశారు.
ఢిల్లీ పోలీసులు నోడల్ సైబర్ యూనిక్‌కు చెందిన సైబర్ ప్రివెన్షన్ అవేర్నెస్ అండ్ డిటెక్షన్ (సైపాడ్), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ల మధ్య ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క్ ద్వారా ఫేస్బుక్ అధికారులు ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేయగలిగారు. వెంటనే సైపాడ్ అధికారులు ఈ సమాచారాన్ని ఆ వ్యక్తి ఇంటికి సమీపంలో ఉన్న అత్యవసర వాహన ఇన్‌ఛార్జి ప్రొబేషనర్ ఎస్పై అమిత్ కుమార్‌కు అందజేశారు. దీంతో వారు ఆ అడ్రెస్‌కు వెళ్లి తలుపులు పగులగొట్టి చూశారు.
అప్పటికే రక్తపు మడుగులో ఉన్న ఆ వ్యక్తిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి.. ఆ తర్వాత ఏయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని సైపాడ్ డీసీపీ అనైష్ రాయ్ తెలియజేశారు. తమకు ఫేస్ బుక్ కార్యాలయం నుంచి 12.50 నిమిషాలకు ఫోన్ వచ్చిందని.. ఆ వెంటనే స్పందించి గంటలోనే అతన్ని రక్షించామని ఆయన వెల్లడించారు.
#Delhi Police rescues man after Facebook alert on ‘self-harm’ video. https://t.co/u9XFZapwGH
— Express Delhi-NCR 😷 (@ieDelhi) June 6, 2021