సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

845

     సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ (75) ఆదివారం తెల్లవారుజామున కన్నమూశారు. దాదాపు రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాటక రంగస్థలం నుంచి వెండితెర‌కి పరిచయమైన ఆయన.. బుల్లితెర‌పై కూడా తనెంటో నిరూపించుకున్నారు. వైజాగ్ ప్ర‌సాద్ మృతి పట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్రకటించారు.

   1983లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన బాబాయ్ అబ్బాయ్‌తో ప్రసాద్ సినిమాల్లోకి అడుగు పెట్టారు. తేజ సినిమా ‘నువ్వు నేను’ లో హీరో ఉదయ్ కిరణ్ తండ్రి పాత్రలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. దీంతో ఆయనకు టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ప్ర‌సాద్ దాదాపు 170కిపైగా సినిమాల్లో నటించారు.

భ‌ద్ర‌ సినిమాలో రవితేజకు మేనమామగా.. జై చిరంజీవ మూవీలో భూమిక తండ్రిగా డాక్టర్ పాత్రలో నటించి మెప్పించారు. ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. ఆయన స్వస్థలం వైజాగ్, అందుకే ఆయన్ను సినీ ఇండస్ట్రీలో వైజాగ్ ప్రసాద్‌గా పిలిచేవారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు.

ఊహా తెలియ‌క ముందే త‌ల్లి చనిపోవడంతో మేన‌మామ ఇంట్లో ఉండి ఎస్‌ఎస్ఎల్‌సీ వరకు చదువుకున్నారు. నాటకాలంటే తెగ ఇష్టపడే ప్రసాద్.. ఆ పిచ్చితోనే ఎంబీబీఎస్ సీటు పోగొట్టుకుని బీఏ చదివారు. ఆయ‌న భార్య పేరు విద్యావ‌తి. వీరికి రత్నప్రభ, రత్నకుమార్ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. అమ్మాయి అమెరికాలో నివాసం ఉండగా, అబ్బాయి లండన్‌లో ఉంటున్నాడు.