దొంగగా మారిన టాలీవుడ్ స్టార్‌ రైటర్‌.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

175

     ఒకానకప్పుడు సూపర్‌ హిట్‌ పాటలు అందించిన రచయిత.. ఇప్పుడు దొంగగా మారారు. అయ్యో అయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తుంద‌య్యో అంటూ చిరంజీవితో స్టెప్పులు వేయించిన రచయిత ఇప్పుడు గుళ్లు.. గోపురాల్లో చోరీలు చేస్తున్నారు. ఎన్నో అద్భుతమైన పాటలు టాలీవుడ్‌ ప్రేక్షకులకు అందించిన కులశేఖర్‌ పరిస్థితి ఇది.

     దేవాలయాల్లో పూజారుల కళ్లుగప్పి శఠగోపాలు, వారి సెల్‌ఫోన్లు, డబ్బులు చోరీచేస్తూ పోలీసులకు చిక్కారు. విశాఖపట్నానికి చెందిన 47 ఏళ్ల కులశేఖర్‌ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివాసముంటూ పలు సినిమాలకు పాటలు రాశాడు. సూపర్‌ హిట్‌ సినిమాలు ఇంద్ర, సంతోషం, ఘర్షణ, చిత్రం, జయం లాంటి సినిమాలతో పాటు ప్రేమలేఖ, ఫ్యామిలీ సర్కస్, వసంతం, మృగరాజు తదితర వంద సినిమాలకు పైగా పాటలు రాశారు.

     అయితే గత కొంతకాలంగా అవకాశాలు రాకపోవడంతో బతుకుదెరువు కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2 లోని ఇందిరానగర్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలో పూజారి బ్యాగ్‌ చోరీకి గురవ్వగా, పోలీసులు నిఘా వేసి సీసీ కెమెరా ఫుటేజీలు, కదలికల ఆధారంగా కులశేఖర్‌ను విచారించడంతో గుట్టురట్టయింది. గతంలో గుడిలో చోరీ చేసిన కేసులో 6 నెలల జైలు శిక్ష అనుభవించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి నుంచి 50 వేల రూపాయల విలువ చేసే పది సెల్‌ఫోన్లు,40 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

     సినిమా అవకాశాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమై చెడు వ్యసనాలకు బానిసయ్యారు. కుటుంబ సభ్యులకు కూడా దూరమయ్యారు. 2016లో కాకినాడలోని ఆంజనేయస్వామి దేవాలయంలో శఠగోపం చోరీ చేశారు. ఆ కేసుపై రాజమండ్రి జైలులో ఆరు నెలలపాటు జైలుశిక్షను అనుభవించారు. ఓ సినిమాలో కులశేఖర్‌ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని దూరం పెట్టింది. బ్రాహ్మణుల మీద కులశేఖర్‌ ద్వేషాన్ని పెంచుకుని పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు విచారణలో తెలిసింది.