‘భారత్‌కు సాయంగా 11 వేల కోట్లిస్తే.. విగ్రహానికే 3వేల కోట్లా!..’ స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీపై UK విమర్శలు

249

     ఈ నెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. అదే రోజున గుజరాత్‌లో 182 అడుగుల పటేల్ భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వం దీనికి ఐక్యతా విగ్రహమని పేరు పెట్టింది. ఒక లక్షా నలభై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, రెండు వేల టన్నుల కాంస్యం, డెబ్బైవేల టన్నుల సిమెంటును ఇందులో వినియోగించారు.

   ”విగ్రహం వల్ల స్థానికులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆదాయం లభిస్తుంది. వారి ఆర్థికస్థితి మెరుగుపడుతుంది” అని సర్దార్ సరోవర్ నర్మదా నిగం జేఎండీ సందీప్ కుమార్ చెప్పారు. ఇది ప్రభుత్వ భావన. అయితే ఇప్పటికే ఎంతో గౌరవం, గుర్తింపు పొందిన వారి విగ్రహాలపై కోట్లు కుమ్మరించేకంటే, అణగారిన వర్గాల బతుకులను బాగు చేయడంపై దృష్టిపెడితే మంచిదని కొందరు అంటున్నారు. నర్మద నది సమీపంలో నివసించే రైతులు, ఇప్పటికీ తాము సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు వేల కోట్ల రూపాయలతో ఐక్యతా విగ్రహం నిర్మిస్తుండగా, మరో వైపు ఇక్కడి ప్రజల కష్టాలు మాత్రం ఇంతవరకూ తీరలేదు.

    నర్మదా నదీ తీరంలో 182 మీటర్ల ఎత్తయిన సర్దార్‌ పటేల్‌ విగ్రహం(స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) ఏర్పాటును యూకే తప్పుపట్టింది. 2012 నుంచి దాదాపు 11వేల కోట్లు సాయంగా అందిస్తే.. అందులో దాదాపు 3 వేల కోట్లు ఈ విగ్రహానికే ఖర్చు చేశారని బ్రిటన్‌ అధికారపక్ష ఎంపీ పీటర్‌ బోన్‌ విమర్శించారు. విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు చేసిందంటే.. ఇక భారత్‌కు మేం సాయం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.