ఉదయం 6నుంచి రాత్రి 7గంటల వరకూ నైటీలు నిషేధం

423
       మహిళలు నైటీలు ధరించి రోడ్లపైకి వస్తే జరిమానా విధిస్తున్నారన్న వార్త సోషల్‌ మీడియాలో కలకలం రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో నైటీలతో రోడ్లపైకి వస్తే రూ.2వేలు జరిమానా, చూసినవారు చెబితే రూ.వెయ్యి బహుమతి ప్రకటించారని, అత్రికమిస్తే గ్రామం నుంచి వెలి వేయాలని గ్రామ పెద్దల కమిటీ నిర్ణయించిందని దాని సారాంశం. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ఆ గ్రామానికి వెళ్లివివరాలు సేకరించింది. 5వేల జనాభా కలిగిన తోకలపల్లిలో ఎక్కువగా పల్లెకారు కుటుంబాలు జీవిస్తుంటాయి. ఇక్కడ 9మందితో పెద్దల కమిటీని ఏర్పాటు చేసుకుని వారి మాటే శాసనంగా అమలు చేస్తుంటారు. కొద్దికాలంగా ఇక్కడి మహిళలు నైటీలు ధరించే తమ పిల్లలను స్కూళ్లలో దింపడం, కిరాణా దుకాణాలకు వెళ్లడం, ఎస్‌ఎంసీ, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు, డ్వాక్రా సమావేశాల్లో పాల్గొనటంతో గ్రామపెద్దల్లో ఆచారాలు, కట్టుబాట్లపై ఆందోళన నెలకొంది. దీనిపై 7నెలల క్రితం గ్రామంలోని పెద్దలతో మహిళలు సమావేశమై చర్చించారు.
      గ్రామంలో ఉదయం 6నుంచి రాత్రి 7గంటల వరకూ నైటీలతో తిరగడంపై నిషేధం విధించారు. దీనిపై మైకుల్లో ప్రచారం చేశారు. అతిక్రమిస్తే జరిమానాకు సిద్ధమవ్వాలని హెచ్చరించారు. అప్పటినుంచి ఈ కట్టుబాటును అమలు చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై కలకలం రేగడంతో తహసీల్దార్‌ సుందరరాజు, ఎస్సై ఎం.విజయ్‌కుమార్‌ గురువారం గ్రామంలో పర్యటించి మహిళలను విచారించారు. స్ర్తీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, మహిళలు స్వేచ్ఛగా జీవించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. అయితే కట్టుబాట్ల పేరుతో మహిళల స్వేచ్ఛను హరించటమేంటని మరో వర్గం వాదిస్తోంది.

ఎవరికీ జరిమానా విధించలేదు

     ఏడు నెలల క్రితమే నైటీల కట్టుబాటు మహిళలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో డ్వాక్రా మహిళలు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ పద్ధతి ఆచరిస్తున్నారు. ఇంతవరకూ ఎవరికీ జరిమానా విధించలేదు. ఎవరినీ వెలి వేయలేదు.
                                                                                             – భలే సీతారాముడు, గ్రామపెద్ద