కమలహాసన్ హీరోగా భారతీయుడు 2 గెటప్‌ సూపర్‌..! ముహూర్తం ఖరారు.

124

    ఇండియన్‌ తాతగా కమల్‌హాసన్‌ గెటప్‌ అదిరింది కదా. వివిధ రకాల గెటప్‌లు వేయడంలో కమల్‌హాసన్‌ తరువాతే ఎవరైనా. దశావతారంలో ఆయన పది గెటప్‌లు ఒకదానికొకటి పోలికే ఉండదు. ఇక ఇండియన్‌ చిత్రంలో కమల్‌హాసన్‌ టైటిల్‌ పాత్రకు మారిన విధం అద్భుతం. కాగా 22 ఏళ్ల తరువాత మళ్ళి తాజాగా మరోసారి ఆయన ఇండియన్‌గా మారబోతున్నారు. అవును కమల్‌హాసన్, శంకర్‌  కాంబినేషన్‌లో ఇండియన్ 2కు ముహూర్తం కుదిరింది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం 14వ తేదీన పూజా కార్యక్రమాలతో చెన్నైలో ప్రారంభం కానుందని సమాచారం. ఇండియన్‌ చిత్రం అధికారుల అవినీతి, లంచం ప్రధాన అంశాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే రెండవ భాగం రాజకీయ నాయకుల అవినీతి గురించి ఉంటుందని తెలిసింది.

కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్‌ 2 చిత్రం ఆయన రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఉంటుందనే ప్రసారం జరుగుతోంది. ఈ చిత్రానికి గానూ కమలహాసన్‌ గెటప్‌ కోసం హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌లను రప్పించి పలు రకాల గెటప్‌లలో ఫొటో షూట్‌ చేశారు. అందులో ఒకటి అదిరిందట. చిత్ర యూనిట్‌నే అబ్బురపరిచిందట.

ఈ సినిమాలో కమల్‌హాసన్‌తో రొమాన్స్‌ చేసే లక్కీచాన్స్‌ను అందాలభామ కాజల్‌అగర్వాల్‌ దక్కించుకుంది. ఇలాంటి అవకాశాన్ని ఊహించని ఈ అమ్మడు ఆనందంతో తబ్బిబ్బైపోతోంది. అమ్మడికి కూడా శంకర్‌ ఫొటో షూట్‌ నిర్వహించనున్నారట. ఈ ఫోటో షూట్‌ను అబ్రాడ్‌లో  చేయనున్నారట. అయితే ఈ బ్యూటీకి సంబంధించిన సన్నివేశాలను మాత్రం చెన్నైలోనే చిత్రీకరించనున్నట్లు తెలిసిందే.

    అదే విధంగా ఇండియన్‌ 2 చిత్రం షూటింగ్‌ అధిక భాగాన్ని పొల్లాచ్చిలో శంకర్‌ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం బ్రహ్మాండమైన సెట్స్‌ కూడా వేస్తున్నారు. 2.ఓ చిత్రం తరువాత శంకర్‌ చేస్తున్న చిత్రం కావడంతో ఇండియన్‌ 2 అదే స్ధాయిలో బ్రహ్మాండంగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.