అంతరిక్ష ప్రయాణానికి సిద్దమవుతున్న కేరళ వాసి..

Santhosh George Kulangara

Santhosh George Kulangara

కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యటకుడు సంతోష్‌ జార్జ్‌ కులంగర (Santhosh George Kulangara) అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. ఇందుకు అమెరికాలోని వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన వ్యోమనౌకలో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సన్, తెలుగు అమ్మాయి బండ్ల శిరీష సహా పలువురు దిగ్విజయంగా అంతరిక్షయాత్ర చేసొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ తరహా యాత్రలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో వర్జిన్‌ గెలాక్టిక్‌ వ్యోమనౌకలో సంతోష్‌ రోదసియాత్ర చేయనున్నారు. ఇందుకోసం 2.5 లక్షల డాలర్ల (రూ.1.8 కోట్లు) ను ఆయన వ్యయం చేయనున్నారు. దీంతో టికెట్‌ కొని రోదసియాత్ర చేసిన తొలి భారతీయ పర్యాటకుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. తనతో పాటు ఓ కెమెరానూ తీసుకెళ్లనున్నట్లు సంతోష్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాలీల తరఫున ఈ యాత్రను చేపడుతున్నానని పేర్కొన్నారు.

‘సంచారం’ పేరుతో యాత్రా విశేషాలను వివరించే కార్యక్రమాన్ని సంతోష్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1800 ఎపిసోడ్లను ప్రసారం చేశారు. ఇప్పటివరకు 24 ఏళ్ల వ్యవధిలో 130కి పైగా దేశాలను చుట్టి వచ్చారు. 2007 నుంచి అంతరిక్ష యాత్ర చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం శిక్షణ కూడా పూర్తిచేసుకున్నారు.