కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి, టెన్షన్ లో మిగతా..

45

శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వాలంటీర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అస్వస్థతకు గురైంది. పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వాలంటీర్లు, వీఆర్వో ప్రసాద్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితకు ఆ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు.

కానీ ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసింది. లలితకు భర్త, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. లలిత మృతిచెందడంతో వ్యాక్సిన్‌ తీసుకున్న మిగతా వాలంటీర్లు, వీఆర్వో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారందరు పలాస పీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నారు.

వ్యాక్సిన్‌ వికటించడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీకా వేసుకున్న తర్వాత జ్వరం వచ్చిందని మెడికల్‌ సిబ్బందికి చెబితే పారాసిటమాల్‌ వేసుకోవాలని చెప్పారన్నారు. తర్వాత రోజు కూడా జ్వరం తగ్గకపోవడంతో టాబ్లెట్‌ వేశామన్నారు. కానీ అప్పటికే పరిస్థితి క్షీణించి చనిపోయిందంటున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు తక్షణ సాయం కింద రూ.2 లక్షలు ప్రకటించారు.