మరుగుతున్న నూనెలో చేతులు పెట్టి 5 రూపాయల కాయిన్ తీయమన్నాడు!

69

మహారాష్ట్రలోని ఉస్మాన్ బాద్‌లో తన భార్యను శీలవతిగా నిరూపించుకోవాలంటూ అగ్ని పరీక్ష పెట్టాడో ఓ భర్త. మరుగుతున్న నూనెలో 5 రూపాయల కాయిన్ వేసి దాన్ని తీయమన్నాడు. ఆ మహిళ కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల వరకు ఇంటికి రాలేదు. ఆ తర్వాత కనిపించిన భార్యను ఇంటికి రావాలంటే తన స్వచ్ఛతను నిరూపించుకోవాలన్నాడు. అదంతా వీడియో కూడా తీశాడు.

ఫిబ్రవరి 11న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో భార్య చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న భర్త ఆమె కోసం నాలుగు రోజులగా వెతికాడు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఒక రోజు ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. గొడవ పెట్టుకుని బయటకు వెళ్లిన రోజున ఉస్మాన్ బాద్‌లో పరాండలో ఖాచపూరి చౌక్ బస్టాప్ దగ్గర బస్ కోసం నిల్చున్నానని చెప్పింది. ఆ రోజున ఇద్దరు వ్యక్తులు బైక్ పై తనను బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలిపింది. నాలుగు రోజుల పాటు తమ దగ్గరే ఉంచుకున్నారని వాపోయింది. ఎలాగో అక్కడి నుంచి బయటపడి ఇంటికి తిరిగి వచ్చినట్టు తెలిపింది. దాంతో తన భార్య చెప్పేది నిజమా కాదా? తెలుసుకునేందుకు అగ్ని పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

వారి సంప్రదాయం ప్రకారం.. అబద్దం చెప్పిన వ్యక్తి.. మహిళ లేదా పురుషుడి చేతులు కాలిపోతాయి. అంతేకాదు ఆయిల్ నుంచి వస్తున్న మంటను కూడా మింగాల్సి ఉంటుంది. అగ్నిపరీక్ష పేరుతో మహిళలను వేధిస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర లెగిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నీలమ్ గోర్హే రాష్ట్ర హోంశాఖను డిమాండ్ చేశారు.