ఐపీఎల్‌ చాంపియన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ అరుదైన ఘనత

తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచిన ఘనత ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్‌ మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌కు హాజరైన 1,04,859 మందితో మైదానమంతా హోరెత్తగా, గుజరాత్‌ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. మే 29 (ఆదివారం) జరిగిన ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించి గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌–2022 విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా,  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 45 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.