రాష్ట్రంలోనే తొలి ఎకో బ్రిడ్జ్‌

తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ. ఇక్కడి నుంచే తెలంగాణలోని అడవుల్లోకి పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి. అందులో మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని ఆసిఫాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న అటవీ ప్రాంతం వాటికి సురక్షిత కారిడార్‌.

ఇప్పుడు ఇదే ప్రాంతం మీదుగా నాగ్‌పూర్‌ –విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కాబోతోంది. నాలుగు వరుసలుగా నిర్మించే ఈ రహదారి పులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే అడవిని చీలుస్తూ.. వాటి మనుగడకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో 150 మీటర్ల పొడవుతో ఎకో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు.

అంటే..వన్యప్రాణులు రాకపోకలు సాగించే సమయంలో జాతీయ రహదారిని దాటేందుకు సహజ సిద్ధ వాతావరణం కల్పిస్తూ నిర్మించే వంతెన అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల పరిరక్షణలో మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ తరహా నిర్మాణం తెలంగాణలోనే మొదటిది కానుండటం విశేషం.