7వ ఈట్‌ రైట్‌ రైల్వే స్టేషన్‌గా విశాఖ రైల్వే స్టేషన్‌

 విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో దొరికే ఆహార పదార్థాలను ఎటువంటి సందేహం, భయం లేకుండా తినేయొచ్చని ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫై చేసింది. విశాఖ రైల్వే స్టేషన్‌కు ఈట్‌ రైట్‌ రైల్వే స్టేషన్‌ గుర్తింపు ఇస్తూ ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది.

ఇలా గుర్తింపు పొందిన దేశంలోని 7వ రైల్వే స్టేషన్‌గా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నిలిచింది. గతంలో చండీగఢ్‌ రైల్వే స్టేషన్, ఢిల్లీలోని ఆనంద్‌ విహార్, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ రైల్వే స్టేషన్, ముంబై సెంట్రల్‌ రైల్వే స్టేషన్, వడోదర, భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్లు ఈ గుర్తింపు పొందాయి.