తనను ప్రేమించిన నలుగురు అబ్బాయిలకు ఓకే చెప్పడంతో ఆ అమ్మాయిని ఎత్తికెళ్ళి..

71

ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో అజీమ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో నలుగురు అబ్బాయిలు తాండా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ఆ నలుగురినీ ప్రేమించింది. కానీ ఆ అమ్మాయి నాదంటే నాదని నలుగురు గొడవకు దిగారు.

అలా ఆ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు కలిసి ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచి ఉంచారు. ఆమెను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఏం కావాలో అన్నీ అమర్చిపెట్టారు. రెండు రోజులకు ఈ విషయం ఆ నోటా, ఈ నోటా ఆ గ్రామం మొత్తానికి తెలిసింది. దీంతో గ్రామస్తులంతా కలిసి ఆ నలుగురు ప్రేమికులతో పాటు ఆ అమ్మాయిని కూడా ఊళ్లోకి తీసుకొచ్చారు.

ఈ విషయం చుట్టు పక్కల ఊళ్లకు తెలిస్తే అమ్మాయి అల్లరైపోతుంది కాబట్టి ఎత్తుకెళ్లిన అబ్బాయిల్లో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు. అమ్మాయిని పిలిచి..‘‘ఆ నలుగురిలో ఎవరు నీకు ఇష్టమో చెప్పు అతనికే ఇచ్చి పెళ్లిచేస్తాం’’ అన్నారు. ఆమె ‘‘నలుగురు నాకు ఇష్టమే..’’అని చెప్పింది.

నలుగురు అబ్బాయిల్ని కూర్చోపెట్టి ’’మీ పేర్లు చిట్టీల్లో రాసి ‘లక్కీ డ్రా’ తీస్తాం. దాంట్లో ఎవరి పేరు వస్తుందో ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేస్తాం’’ అని కరాఖండీగా చెప్పేశారు. గ్రామ పెద్దలు అంతా పంచాయతీ వద్దకు చేరి నాలుగు స్లిప్పుల్లో నలుగురు అబ్బాయిల పేర్లు రాసి లక్కీ డ్రా వేశారు. డ్రాలో విజేతగా నిలిచిన అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేసేశారు. ఇదేదో సినిమా స్టోరీలాగా ఉన్నాగానీ నిజంగానే జరిగింది.