
ప్రపంచంలో ఉత్తమ పాఠశాలల ఎంపిక కోసం షార్ట్‌లిస్టు చేసిన స్కూళ్ల జాబితాలో ఇండియా నుంచి ఐదు పాఠశాలలకు స్థానం దక్కింది. వివిధ కేటగిరీల్లో మొదటి 10 పాఠశాలల్లో 5 ఇండియాకు చెందిన పాఠశాలలే కావడం విశేషం. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ‘టీ4 ఎడ్యుకేషన్’ అనే డిజిటల్ మీడియా వేదిక వివిధ కేటగిరీల్లో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేస్తోంది.
యాక్సెంచర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, టెంపుల్టన్ వరల్డ్ చారిటీ ఫౌండేషన్, లేమన్ ఫౌండేషన్ సహకారంతో 2,50,000 డాలర్లతో ‘బెస్టు స్కూల్ ప్రైజెస్’ను ఏర్పాటు చేసింది. ఇన్నోవేషన్ కేటగిరీలో ముంబైలోని ఎస్‌వీకేఎమ్స్ సీఎన్‌ఎమ్ స్కూల్, ఢిల్లీలోని ఎస్డీఎంసీ ప్రైమరీ స్కూల్‌కు టాప్10లో స్థానం దక్కింది. సామాజిక భాగస్వామ్యం విభాగంలో ముంబైలోని ఖోజ్ స్కూల్, పుణేలోని పీసీఎంసీ ఇంగ్లిష్ మీడియం స్కూల్ చోటు దక్కించుకున్నాయి.
అవరోధాలను ఎదుర్కొని నిలిచిన స్కూళ్ల జాబితాలో హౌరాలోని సమారిటన్ మిషన్ హైస్కూల్‌కు స్థానం లభించింది. మొత్తం ఐదు కేటగిరీలు ఉండగా, ఒక్కో కేటగిరీలో ఒక అత్యుత్తమ పాఠశాలను ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఎంపిక చేయనున్నారు. బహుమతి కింద ఒక్కో స్కూల్‌కు 50,000 డాలర్ల చొప్పున నగదును అందజేస్తారు.