లాక్​డౌన్​లో పని దొరక్క తినడానికి తిండి కరువవడంతో మనస్థాపానికి గురై

18

మెదక్​ పట్టణంలోని గాంధీనగర్​ బుడగ జంగాల కాలనీకి చెందిన కడమంచి రాములుకు కొద్దిరోజుల క్రితం పక్షవాతం వచ్చింది. ఆయన భార్య లక్ష్మి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కూతుళ్ల వివాహమైంది. కొడుకు సంచార జీవనం సాగిస్తున్నాడు.

కరోనా లాక్​డౌన్​తో కూలి పనులు దొరక్క ఇల్లు గడవడం కష్టంగా మారింది. కనీసం తినడానికి తిండిలేని దీనావస్థలో ఎవరినీ చెయ్యిచాచి అడగలేక రాములు(48), లక్ష్మి(44) శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం గమనించిన కొడుకు చుట్టుపక్కల వారికి విషయం చెప్పాడు.

మృతుల కొడుకు, కూతుళ్లను టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మ్యాడం బాలకృష్ణ పరామర్శించి అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందించారు.   ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.