పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ…. యువకునిపై దాడి!

32

ఢిల్లీలో ఖజూరీ ఖాస్‌లో ఒక యువకునిపై దాడి చేసి, అతని చేత బలవంతంగా హిందుస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలు చేయించిన ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియోతో పాటు ఒక మెసేజ్ కూడా వైరల్ అయ్యింది. దీని ఆధారంగా ఖజూరీ ఖాస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అజయ్ గోస్వామి(25) అనే నిందితుడిని అరెస్టు చేశారు.

కాగా ఈ వీడియోను చిత్రించిన మరో నిందితుడు దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సంజయ్ కుమార్ సేన్ మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యిందని, దానిలో ఒక యువకుడు మరో యువకునిపై దాడి చేస్తున్న దృశ్యాలున్నాయన్నారు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.

 ఈ ఘటన ఖజూరీ ఖాస్ ప్రాంతంలో జరిగిందని, పోలీసులు విచారణలో నిందితుడిని అజయ్ గోస్వామిగా గుర్తించి, అరెస్టు చేశామన్నారు. అజయ్ ఢిల్లీ అల్లర్ల నిందితుడని, ఇటీవలే అతను బెయిల్‌పై విడుదలయ్యాడని పేర్కొన్నారు. కాగా అజయ్ పోలీసులతో మాట్లాడుతూ ఆ యువకుడు చోరీ చేయాలనే నెపంతో తన డెయిరీలోకి చొరబడ్డాడని పేర్కొన్నారు. అందుకే అతనిని కొట్టానని తెలిపాడు. అతని స్నేహితుడు దీపక్ వీడియో తీసి, వైరల్ చేశాడని తెలిపాడు.