చనిపోయిన తల్లి జ్ఞాపకాల కోసం తొమ్మిదేళ్ళ చిన్నారి ఆవేదన

15

కొడగు జిల్లాలోని కుశల్ నగర్‌కు చెందిన రోజువారీ కూలీ ప్రభ కోవిడ్-19 సోకడంతో మడికెరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మే 16న మరణించింది. 9 ఏళ్ల హృతీక్షకు తన తల్లి భౌతికంగా దూరమైంది. ఇక మిగిలింది సెల్‌ఫోన్‌లో నిక్షిప్తమైన చిత్రాలు, వీడియోలే. వాటిలోనే తన తల్లిని చూసుకోవాలని, ఆ మధురానుభూతుల్లో మళ్ళీ మళ్ళీ తేలియాడాలని ఆ చిన్నారి అనుకుంది. కానీ ఆ సెల్‌ఫోన్ కూడా దొంగతనానికి గురైంది.

తన తల్లి మధుర జ్ఞాపకాలను తనకు దూరం చేయవద్దని, ఆ సెల్‌ఫోన్ దొరికినవారు తనకు తిరిగి ఇచ్చేయాలని కోరింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. హృతీక్ష మనోవేదనను అర్థం చేసుకున్న నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తన సెల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని ఆమె చేసిన విజ్ఞప్తిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. దానిని త్వరగా గుర్తించి, ఆమెకు అప్పగించాలని పోలీసులను కూడా కోరుతున్నారు.

హృతీక్ష మేనత్త అక్షిత మాట్లాడుతూ, మే 15న తాము ప్రభకు ఫోన్ చేశామని, అప్పుడు ఆమె ఫోన్ స్విచాఫ్ వచ్చిందని చెప్పారు. ఆ మర్నాడు (మే 16న) ఆమె మరణించినట్లు తమకు చెప్పారన్నారు. ఆమె సెల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని తాము కోరామని, కానీ అది కనిపించడం లేదని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని తెలిపారు. ఆ సెల్‌ ఫోన్‌లో ప్రభ ఫొటోలు  ఉన్నాయని, వాటినైనా చూసుకుందామని హృతీక్ష అనుకుంటోందని, ఆ ఫోన్ పోయినప్పటి నుంచి ఆమె తీవ్రంగా ఏడుస్తోందని చెప్పారు.

కొడగు పోలీస్ సూపరింటెండెంట్ క్షమ మిశ్రా మాట్లాడుతూ, హృతీక్ష ఫిర్యాదు అందిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సెల్ ఫోన్‌ను గుర్తించేందుకు ఆసుపత్రిని సంప్రదించినట్లు  తెలిపారు.