తండ్రి వయసున్న వ్యక్తికి బాలికను రూ.10 వేలకు అమ్మేసిన తల్లిదండ్రులు

35

నెల్లూరులోని కొత్తూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. చికిత్సకు డబ్బులు లేకపోవడం, కుటుంబ పోషణ కష్టంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తూరులోనే ఉండే చినసుబ్బయ్య(46) అనే వ్యక్తి ఆ పేద కుటుంబ అవసరాలను ఆసరాగా చేసుకున్నాడు.

కొంతకాలం క్రితం అతడి భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. బాలిక తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి రూ.10వేలకు కొనుగోలు చేశాడు. ఆ బాలికను పెళ్లి చేసుకొని ఈనెల 24న విడవలూరు మండలం, దంపూరులోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. ఐతే రాత్రి సమయంలో బాలిక పెద్దగా ఏడవడంతో స్థానికులు ఆరా తీశారు.

దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే గ్రామ సర్పంచ్ సురేష్ కు సమాచారమిచ్చి బాలికను మరో ఇంట్లో ఉంచారు. గ్రామ సచివాలయ సిబ్బందికి విషయం చెప్పారు. వారు ఐసీడీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదికారులు బాలికను నెల్లూరులోని శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

  • 12
    Shares