రోడ్డు పక్కన తుప్పల్లో అపస్మారక స్తితిలో అమ్మాయి..

40

విజయనగరం జిల్లా గుర్లలో ఈనెల 1న అడవిలో ఓ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో కనిపించిన ఘటనంతా నాటకంగా పోలీసులు తేల్చేశారు. బొబ్బిలి డివిజన్‌కు చెందిన యువతి విజయనగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఫిబ్రవరి 27న పట్టణంలోనే ఉంటున్న తమ బాబాయి ఇంటికని చెప్పి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్లింది. అదే సమయంలో ఆమె సోదరుడు వాకబు చేయడం ప్రారంభించారు.

విషయం తెలుసుకున్న యువతి 28న సాయంత్రం బస్సు ఎక్కి విజయనగరం బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో గుర్ల దాటిన తర్వాత బస్సు దిగింది. రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి అందర్నీ నమ్మించేందుకు తనకు తానే కాళ్లు, చేతులను చున్నీతో కట్టుకొని అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లుగా నటించింది. అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు విద్యార్థినిని విచారించగా ఆమె చెబుతున్న మాటలకు, సంఘటనా ప్రాంతంలో పరిస్థితికి పొంతన కుదరలేదు. మొదట నలుగురు కుర్రాళ్లు తనను ఆటోలో తీసుకెళ్లినట్లు చెప్పింది. సీసీ పుటేజీలు, ఇతర ఆధారాలతో అది నిజం కాదని తేలింది. చివరకు ఆమె నిజం ఒప్పుకోక తప్పలేదు. ఆమె 2016లోనూ ఇలాగే ఇంటి నుంచి వెళ్లిపోగా, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదైంది.