వివాదాస్ప‌ద తీర్పులు ఇచ్చిన మ‌హిళా జ‌డ్జికి సుప్రీం బ్రేక్

21

బాలిక‌పై లైంగిక దాడి కేసులో వివాదాస్ప‌ద తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ పుష్పా వీరేంద్ర గ‌నేదివాలాకు ప‌ర్మ‌నెంట్ స్టాట‌స్ ఇవ్వాల‌న్న అంశంపై సుప్రీంకోర్టు వెన‌క‌డుగు వేసిన‌ట్లు తెలుస్తోంది. నేరుగా శ‌రీరాన్ని తాక‌న‌ప్పుడు ఆ కేసు పోక్సో కింద‌కు రాదు అని పేర్కొన్న ఆ జ‌డ్జికి ప‌దోన్న‌తి క‌ల్పించే అవ‌కాశాన్ని సుప్రీం విర‌మించిన‌ట్లు ఓ మీడియా క‌థ‌నం ద్వారా వెల్ల‌డైంది. బాంబే హైకోర్టులో శాశ్వ‌త జ‌డ్జిగా ఉండేందుకు నాగ‌పూర్ బెంచ్‌కు చెందిన జ‌స్టిస్ పుష్పాకు అవ‌కాశం వ‌చ్చింది.

అయితే సుప్రీం కొలీజియం ఈ అంశంలో త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను వెన‌క్కి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర‌కు చెందిన న్యాయ‌మూర్తులు డీవై చంద్ర‌చూడ్‌, ఏంఎ ఖాన్‌విల్క‌ర్‌ల ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే, జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ‌, రోహింటన్ ఫాలీ నారీమ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాసనం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు మీడియా క‌థ‌నం వెల్ల‌డించింది.

జ‌స్టిస్ పుష్పాకు బాంబే హైకోర్టులో ప‌ర్మ‌నెంట్ జ‌డ్జిగా అవ‌కాశం క‌ల్పిస్తూ జారీ చేసిన ఆదేశాల‌ను ఆ ధ‌ర్మాస‌నం వెన‌క్కి తీసుకున్న‌ది. పోక్సో చ‌ట్టం కింద మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న‌వారిని ఒక వారం రోజుల్లోనూ నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ జ‌స్టిస్ పుష్పా గ‌నేదివాలా వివాదాస్ప‌ద తీర్పులు ఇచ్చారు. దీంతో ఆమె ప‌ర్మ‌నెంట్ స్టాట‌స్‌కు బ్రేక్ ప‌డింది.