దిశ కేసులో కొత్త ట్విస్ట్.. లారీ ఓనర్‌ పై అనుమానాలు..

42

2019, నవంబర్ 27వ తేదీన శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో వెటర్నరీ డాక్టర్ ‌అయిన దిశపై ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు దారుణంగా అత్యాచారం చేసి, ఆపై షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశమై ‘దిశ’ కమిషన్‌ను ఆశ్రయించి తమకు ప్రాణహాణి ఉందంటూ ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య యాక్సిడెంట్ కేసులో తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.

అంతేకాదు.. దిశ హత్యాచారం కేసులో లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డిపై అనుమానం ఉందని, ఆయన్ని పోలీసులు విచారించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ‘దిశ’ కమిషన్‌ను కోరారు. కేసు వెనక్కి తీసుకుంటే రూ. 25 లక్షలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఈ కేసులో కీలక విషయాలు బయటపెడతామంటూ ప్రకటించారు. అయితే వీరు చేసిన తాజా ఆరోపణలతో ‘దిశ’ కేసు మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.