చెల్లిని కొట్టాడని బావను ట్రక్కుకు కట్టి లాక్కెళ్ళాడు..

31

గుజరాత్‌లో సూరత్ జిల్లాలోని పల్సానా తాలూకాలోని స్థానిక దుర్గా నగర్ సొసైటీలో బాలు అలియాస్ బాలకిషన్ రాథోడ్ (32) తన భార్య షీతల్‌తో కలిసి నివసిస్తున్నాడు. బాలు డైయింగ్ అండ్ ప్రింటింగ్ మిల్లులో పనిచేసేవాడు. తాగుడుకు బానిసైన బాలు ఎప్పటిలాగే తాగి శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. తాగిన మత్తులో మళ్లీ షీతల్‌తో గొడవపడి కొట్టాడు.

విసుగు చెందిన షీతల్ సమీపంలోని బాలాజీ గ్రీన్ సొసైటీలో ఉండే తన అన్న అనీల్ చౌహాన్‌కు ఫిర్యాదు చేసింది. చౌహాన్ బాలుతో గొడవపడి కొట్టాడు. మద్యం మత్తులో కిందపడ్డ బాలును షీతల్ తాడుతో కట్టేసింది. ఆ తాడు మరో చివరను చౌహాన్ తన టెంపోకు కట్టి రోడ్డు మీద దాదాపు అర కిలోమీటర్ లాక్కెళ్లాడు.

స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారమివ్వడంతో బాలును SMIMER ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలపాలైన బాలు ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్నాడు. బాలు బంధువు ఫిర్యాదు మేరకు కడోదర పోలీసులు చౌహాన్ మరియు షీతల్‌లపై కేసు నమోదు చేశారు.

వీరిద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు కడోదర ఇన్‌స్పెక్టర్‌ బ్రహ్మ్‌భట్‌ తెలిపారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యం క్లిష్టంగానే ఉంది. నిందితులిద్దరికీ కరోనా పరీక్షలు చేసిన తర్వాత అదుపులోకి తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు.

  • 12
    Shares