కారు డ్రైవర్‌ను రోడ్డుపైనే బూటు కాలితో తన్నుతూ..

32

సంగారెడ్డి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ బొలేరో వాహనం డ్రైవర్‌ పట్ల దారుణంగా ప్రవర్తించారు. వాహనం ఆపమనగానే ఆపకుండా కాస్త దూరం వెళ్లి ఆపిన పాపానికి డ్రైవర్‌పై పోలీసులు మానవత్వాన్ని మరిచి అమానుషంగా ప్రవర్తించారు. బూటు కాలితో తంతూ, లాఠీలతో చితకబాదుతూ ఆ డ్రైవర్ పై తమ ప్రతాపం చూపారు.

సదాశివపేటకు చెందిన వాజీద్‌ బొలెరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా అయ్యప్ప స్వామిగుడి దగ్గర పోలీసులు, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వాజీద్‌ను వెహికల్‌ పక్కకు తీయాలని కోరారు. తన వాహనాన్ని కొంత ముందుకు తీసుకెళ్లి ఆపాడు వాజీద్‌.

దీంతో ఆగ్రహానికి గురైన కానిస్టేబుల్‌ వాజీద్‌ను దుర్భాషలాడుతూ లాఠీతో కొట్టడమే కాకుండా బూటు కాలితో తన్నాడు. ఈ ఘటనలో వాజీద్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఓ వైపు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అని పై అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం పలు విమర్శలకు దారితీస్తున్నాయి.

డ్రైవర్‌ను చితకబాదిన ఘటన పై జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. విచక్షణారహితంగా ప్రవర్తించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామన్నారు. కానిస్టేబుల్‌ రాములు, హోంగార్డు బాలరాజును సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై దుర్గయ్య, మరో కానిస్టేబుల్‌ ప్రసాద్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

  • 3
    Shares