పాము కాటేసింది.. మందు ఇవ్వండి అంటూ పాముతో సహ ఆసుపత్రికి..

ఝరీగాన్ పంచాయతీ పరిధిలోని ఉమరకోట్‌‌లోని ఛోటాగుడ గ్రామానికి చెందిన సుధాంశు సిల్‌ (35) అనే యువకుడు బుధవారం తన పొలంలో పనిచేస్తుండగా తాచుపాము అతడి మణికట్టుపై కాటేసింది. పాము కాటుకు ఏమాత్రం భయపడని సుధాంశు ఒక చేతితో పాము తల భాగాన్ని బిగ్గరగా నొక్కి పట్టుకుని తన మోటారు బైక్‌పై ఉమరకోట్‌ సామాజిక ఆస్పత్రికి వచ్చాడు.

చేతిలో పాముతో వచ్చిన సుధాంశును చూసి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది, రోగుల బంధువులు భయాందోళనకు గురయ్యారు. దీంతో సుధాంశు ఆ పామును ఒక సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టి ఆస్పత్రిలోనికి వచ్చాడు. చికిత్స కోసం వైద్యులను ఆశ్రయించాడు. బాధితుడికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు.

తాచు పాము కాటు వేసినా సుధాంశు చలించకపోవడం, కాటు వేసి కొన్ని గంటలైనా అతడికి ఏమీకాకపోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం అతడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. సుధాంశు ధైర్యమే అతడిని త్వరగా కోలుకునేలా చేస్తుండవచ్చు. తనను కాటేసినా సుధాంశు ఆ సర్పాన్ని చంపేయకపోవడం మరో విశేషం!

Snake Bitten