8 రోజుల కవల పిల్లలను కోతులు ఎత్తుకుపోయి..

43

తమిళనాడులో గల తంజావూర్‌ని మేల అలంగమ్ ప్రాంతంలో శనివారం నాడు కోతులు సృష్టించిన బీభత్సానికి 8 రోజుల ఓ పనికందు బలైపోయింది. కవలలను ఎత్తికెళ్లిన కోతులు ఇద్దరు చిన్నారులలో ఓ చిన్నారిని నీళ్లలో విసిరేయడంతో ఆ పసికందు అక్కడిక్కడే ప్రాణం వదిలేసింది. తల్లి గట్టిగా అరవడంతో అది విన్న స్థానికులు వేగంగా స్పందించి మరో పసికందుని కాపాడగలిగారు.

కోతులు ఇంట్లోకి ప్రేశించిన సమయంలో తల్లి బాత్రూమ్‌లో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఆ సందర్భంలో ఆమె భర్త కూడా ఇంట్లో లేడు. ఈ సమయంలో ఇంటి కప్పుపై ఉన్న పెంకులు తొలగించి లోపలికి దూకిన కోతుల మంద చాపపై పడుకున్న కవల పిల్లలను ఎత్తికెళ్లిపోయాయి.

కోతుల అలజడితో బయటకు వచ్చిన తల్లి, పిల్లలు ఇద్దరూ కనిపించకపోవడంతో షాక్ అయింది. ఇంతలో బిడ్డల ఏడుపు వినపడటంతో ఆమె బయటకు వెళ్లిచూడగా గోడపై ఎక్కి కూర్చున్న ఓ కోతి చేతిలో బిడ్డ ఉండటం కనబడింది. అది చూసిన ఆమె గట్టిగా అరిచింది. కోతి ఆ బిడ్డను అక్కడేవదిలేసి పారిపోవడంతో స్థానికులు బిడ్డను కాపాడగలిగారు.

మరో బిడ్డ కోసం వెతకగా రెండో బిడ్డ నీటిలో తేలుతూ కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. కొన్ని రోజులుగా తమ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందంటూ స్థానికులు ఈ సందర్భంగా వాపోయారు. బిడ్డ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కవలలు ఈ నెల 6న జన్మించారని వారు తెలిపారు.