This Day in History: 1956-07-19

రాజేంద్ర ప్రసాద్ గద్దె

రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

రాజేంద్రప్రసాద్ క్రిష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకట నారాయణ, మాణిక్యాంబ. అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్. టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతనికి ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు.

ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించాడు. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు. నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలిచిత్రం బాపు దర్శకత్వంలో స్నేహం అనే సినిమా 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడు. నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాలరేలంగి నరసింహారావుఈవీవీ సత్యనారాయణబాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్రప్రసాదుది.

తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.