This Day in History: 1794-07-10

1794: పద్మనాభ యుద్ధంలో రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం.

పద్మనాభ యుద్ధం 1794జూలై 10న విశాఖపట్నం జిల్లా, పద్మనాభం వద్ద జరిగింది. ఈ యుద్ధం మద్రాసు గవర్నరు జాన్ ఆండ్రూస్ తరఫున వచ్చిన బ్రిటిషు కల్నల్ పెందర్‌గాస్ట్ కు విజయనగర రాజులకూ మధ్య జరిగింది. యుద్ధములో చిన్న విజయరామరాజు మరణించాడు. యుద్ధ పర్యవసానంగా విజయనగరం పూర్తిగా బ్రిటిషు పాలనలోకి వచ్చింది.

యుద్ధానికి కారణాలు

పద్మనాభం వద్ద గోస్థనీ నది

1768 నాటికి గంజాం గిరిజన ప్రాంతంలో పర్లాకిమిడి, మొహిరి, గుంసూరుప్రతాపగిరి మొదలైన 20 మంది జమీందారులు ఉండేవారు. వారి ఆధీనంలో 34 కోటలు, ఇంచుమించు 35,000 సైన్యం ఉండేది. వీరిలో ఎక్కువమంది ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసారు. వీరిలో కొందరికి కొండలకు ఎగువనున్న మన్యం ప్రాంతంలో కోటలు ఉండేవి. అందువలన ఓడిపోయిన జమిందారులు ఈ కోటలలో తలదాచుకుని తిరుగుబాటును కొనసాగించేవారు.

విజయనగర రాజు ఆనంద గజపతిరాజు మరణం తరువాత చిన విజయరామరాజు జమీందారయ్యాడు. అతడు బాలుడు కావడం వలన సవతి తల్లి కుమారుడైన సీతారామరాజు దివానుగా నియమించబడ్డాడు. చిన విజయరామరాజుకు యుక్త వయసు రాగానే సీతారామరాజును దివాన్ పదవి నుండి తొలగించాడు. అందుకు ఆగ్రహించిన దివాన్ ఆంగ్లేయులతో చేతులు కలిపాడు.

1759-68 మధ్య కాలంలో విజయరామరాజు గంజాం, విశాఖపట్నం ప్రాంతాలలోని అనేక మంది జమీందారులను ఓడించి వారిని కారాగారంలో బంధించి, వారి భూముల్ని ఆక్రమించి నిరంకుశంగా పాలించసాగాడు.

విజయనగర జమీందారు చెల్లించవలసిన పేష్కస్ పెంచడానికి, అతని సైనిక బలాన్ని తగ్గించడానికి, అతడి నుండి ఎనిమిదిన్నర లక్షల పేష్కస్ బకాయిలను వసూలు చేయడానికి ఆంగ్లేయులు ప్రయత్నించారు. తాను వారికి ఋణపడలేదని అతడు ఋజువు చేసినప్పటికీ ఆంగ్లేయులు 1793 ఆగష్టు 2 న విజయనగరాన్ని ఆక్రమించారు. రాజ్యంలోని రైతులు ఆంగ్లేయులకు భూమి శిస్తు చెల్లించడానికి నిరాకరించారు. అందువలన ఆంగ్లేయులు చిన విజయరామరాజును నెలకు 1200 రూపాయల పింఛనుతో మచిలీపట్నానికి వెళ్ళవలసిందిగా ఆదేశించారు. దానిని లెక్కచేయకుండా రాజు విజయనగరంభీమునిపట్నం మధ్యనున్న పద్మనాభం చేరాడు. ఆంగ్లేయుల సేనలు చిన విజయరామరాజును ముట్టడించి యుద్ధంలో ఓడించి వధించాయి.

యుద్ధం

ఒప్పందం ప్రకారం చెల్లించవలసిన కప్పాన్ని ఇంకాస్త పెంచి అదనంగా చెల్లించాలని, సైన్యం సంఖ్య తగ్గించుకోవాలనీ విజయనగర పాలకుడు చిన్నవిజయరామరాజును బ్రిటీష్ వాళ్ళు డిమాండ్ చేశారు. బ్రిటీష్ వాళ్ళు బకాయిలుగా డిమాండ్ చేస్తున్న లక్షా యాభైవేల పెస్కాలను తాను చెల్లించవలసిన అవసరం లేదని, ఒప్పందం ప్రకారం చెల్లించిన వలసి కప్పం మొత్తం ఇప్పటికే చెల్లించానని, సైన్యం సంఖ్య ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించబోనని బ్రిటిషర్లకు విజయరామరాజు గట్టిగా సమాధానమిచ్చాడు. దాంతో ఆగ్రహించిన బ్రిటీష్ వారు విజయనగరాన్ని అక్రమించారు. విజయనగరం నుంచి విజయరామరాజు పద్మనాభం ఊరికి మకాం మార్చాడు. మద్రాస్ గవర్నర్ సర్ చార్లెస్ ఓక్లే తరపున కల్నెల్ పెండర్గస్ట్ బ్రిటీష్ సైన్యానికి నాయకత్వం వహించాడు. పద్మనాభం వద్ద మకాం వేసిన చిన్న విజయ రామరాజుపై దొంగదెబ్బతీయడానికి పథకం రచించాడు.

అంతకు ముందు కొండూరు యుద్ధంలో ఫ్రెంచివారిని తుదముట్టించిన చరిత్ర సొంతం చేసుకున్న విజయనగర రాజులు అదే స్ఫూర్తితో బ్రిటీష్ వారిపై కూడా పోరుకు సిద్ధమయ్యారు. అనంత పద్మనాభ స్వామి సన్నిధి లోనే వ్యూహరచన చేసి పోరుబాట పట్టారు. విజయనగర రాజుల తిరుగుబాటు సమాచారాన్ని తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం కలవరపాటుకు గురయింది. దీన్ని అణిచివేసేందుకు 1794 మే 29వ తేదీన కల్నల్ ఫ్రెండర్ గార్డు నేతృత్వంలోని అయిదు కంపెనీల సైన్యాన్ని భీమిలి ప్రాంతంలో మోహరించింది. యుద్ధమో, మద్రాస్ వెళ్ళేందుకు సిద్ధమవడమో తేల్చుకోవాలన్న బ్రిటిష్ సైన్యం ఆదేశాలను విజయరామరాజు ధిక్కరించాడు. తన నాలుగువేల సైన్యంతో పద్మనాభం వద్ద యుద్ధానికి సిద్దమయ్యాడు.

విజయరామరాజు ఒకవైపు బ్రిటీష్ దౌత్యవేత్తలతో రాయబారం నడుపుతూ, సామరస్య పూర్వక పరిష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే అర్ధరాత్రి వేళ దాడికి బ్రిటీష్ వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారు. గాఢనిద్రలో ఉన్న విజయనగరం సైన్యంపై బ్రిటిష్ మూకలు దాడిచేసి భయభ్రాంతులకు గురిచేశారు. పరిస్థితిని అంచనా వేసిన విజయరామరాజు తన వెంట వచ్చిన సైన్యంతో కలిసి తెల్లదొరలపై జూలై 10వ తేదీన పోరాడాడు. అయితే విజయనగరం సైనికుల్లో ఒకడు శత్రుసేనానితో చేతులు కలపడంతో దొంగదారిలో వచ్చి తెల్ల దొరలు కురిపించిన గుండ్ల వర్షానికి చిన విజయరామరాజుతో పాటు సుమారు మూడు వందల మంది సైనికులు, సామంత రాజులు నేలకొరిగారు. వీరి తిరుగుబాటు తెల్లవారి వెన్నులో వణుకు పట్టించింది. అంతేకాకుండా తర్వాత తరాలకు తర్వాత జరిగిన అనేక ఉద్యమాలకు ఊపిరిగా, ఉత్తేజంగా నిలిచింది.

పర్యవసానం

చిన విజయరామరాజు చనిపోయిన తరువాత అతని కుమారుడైన నారాయణబాబు మక్కువ ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడి కొండ దొరలు, సర్దారులు అతనికి అండగా నిలిచారు. చివరికి అతడు బ్రిటిష్ వారికి 5 లక్షల పేష్కస్ చెల్లించడానికి అంగీకరించి రాజీ చేసుకున్నాడు.

ఆంగ్లేయులు విజయనగరాన్ని ఆక్రమించిన తరువాత కారాగారంలో బంధింపబడిన జమిందారులకు విముక్తి కలిగించారు. వారి భూములను వారి ఆధీనం చేసి వారితో ప్రత్యేక ఒడంబడికలు చేసుకున్నారు. క్రీ.శ. 1802లో వారి జమీనులకు శాశ్వత శిస్తు నిర్ణయ విధానం అమలు జరుపబడినది.

విజయరామ రాజు సంస్మరణ దినం

విజయరామరాజు సంస్మరణ దినాన్ని ఏటా పద్మనాభయుద్ధ ఘటనగా నిర్వహించుకోవడం ఉత్తరాంధ్రలో ఆనవాయితీగా వస్తున్నది. పద్మనాభయుద్ధానికి గుర్తుగా రెండో విజయరామరాజు సమాధిని, స్మారక మందిరాన్ని మండల కేంద్రమయిన పద్మనాభంలో నిర్మించారు.

error: