This Day in History: 1878-06-25

1878 : ప్రముఖ బాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతీష్యం శాస్త్ర పండితుడు వఝల సీతారామ శాస్త్రి జననం

వఝుల సీతారామశాస్త్రి లేదా వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి (జూన్ 251878 – మే 291964) ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. పలు శాస్త్రాలను అభ్యసించి ఎన్నో రంగాల్లో కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ద్రవిడ భాషల పరిశీలన, అధ్యయనం తదితర రంగాల్లో ఆయన విస్తృతమైన కృషిచేశారు.

జీవిత విశేషాలు: వఝుల సీతారామశాస్త్రి జూన్ 251878కు సరియైన బహుధాన్య నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ చతుర్థి న ఆరామద్రావిడశాఖకు చెందిన ప్రముఖ విద్వత్ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు చినసీతారామస్వామిశాస్త్రి. తండ్రి ముఖలింగేశ్వరుడు. తల్లి పేరు వేంకటాంబిక. సీతారామశాస్తి ఇంటిపేరు కూడా ఒజ్జ (ఉపాధ్యాయుడు) లు అనే పదం నుంచి వచ్చిందని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారంటే వారి కుటుంబంలోని విద్వత్ సంప్రదాయం గురించి తెలుస్తోంది. గణితశాస్త్రాధ్యయనం, మూహూర్త నిర్ణయం, జన్మనక్షత్ర జాతకాదుల పరిశీలన వారి కుటుంబంలో పరంపరాగతంగా వచ్చిన విద్యలు. ఆయన స్వగ్రామం బొబ్బిలి సమీపంలోని పాలతేరు. ఆయన విజయనగర సంస్కృత కళాశాల, చెన్నపుర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలల్లో దశాబ్దాల పాటు బోధనా వృత్తిలో పనిచేశారు. మే 291964 న మరణించారు.

శాస్త్రాధ్యయనం: చిన్నతనంలోనే ఆయన తమ చినతాత చినవేంకట సిద్ధాంతి సాన్నిధ్యంలో జాతక ముహూర్త సిద్ధాంత భాగాలు, లీలావతి గణితం అభ్యసించారు. మరొక పినతాత వద్ద సంస్కృత వ్యాకరణ ధర్మశాస్త్రాలు ఆకళింపు చేసుకున్నారు. నడాదూర్ అనంతాళ్వార్ ఆచార్యుల శిష్యరికంలో తర్క వేదాంత శాస్త్రాలను అభ్యసించారు. శాస్త్రిగారు తమ తండ్రిగారుయదగు ముఖలింగేశశాస్త్రి గారి వద్ద సంస్కృత కావ్యములను అభ్యసించిరి.పినతండ్రిగారగు నారాయణ కవీంద్రుల వద్ద సంస్కృత చ్ఛందోలంకార వ్యాకారణములను, ధర్మశాస్త్రమును అభ్యసించిరి.శ్రీశాస్త్రి గారి తర్క వేదాంత శాస్త్రాధ్యయనము నడాధూర్ అనంతాళ్వార్ గారి వద్ద జరిగింది.విద్వాన్ వేంకటరాజురెడ్డి గారివద్ద తమిళ కర్ణాటక మలయాళ వ్యాకరణములను శ్రీ శాస్త్రిగారు అభ్యసించిరి.తమ కనిష్ఠ పితామహులగు చిన వేంకట సిద్దాంతిగారి వద్ద జాతక ముహూర్త సిద్దంతములను లీలావతి బీజ గణితమును నేర్చుకొనిరి.

ఉద్యోగము: 1910-1912 సం.మధ్య విజయనగరము లోని రిప్పన్ హిందూధియోలాజికల్ హైస్కూలులో ఆంధ్రోపాధ్యాయ పదవి. 1912-1930 సం.మధ్య శ్రీవిజయనగర మహారాజావారి సంస్కృత కళాశాలలో ప్రధానాంధ్రోపాధ్యాయ పదవి. 1930-1933 మధ్య మదరాసు విశ్వ విద్యాలయము వారి ప్రాచ్య విద్యాపరిశోధక సంస్థలో ఆంధ్రోపాధ్యాయ పదవి పదవి. 1933-1941 మధ్య ఆంధ్రవిశ్వ కళాపరిషత్తులో ఆంధ్రోపాధ్యాయ పదవి

భాషాశాస్త్ర పరిశోధన: సీతారామశాస్త్రి ద్రావిడ భాషల స్వభావ సారూప్యాల పరిశీలనలో అపారమైన కృషిచేశారు. తెలుగు వ్యాకరణాల తీరుతెన్నుల విషయంలో ఆయన తన లోతైన పరిశోధనలు వెలువరించారు. భాషాశాస్త్ర పరిశోధనల్లో భాగంగా ద్రావిడ భాషల్ని పరిశోధిస్తూ “ద్రావిడ భాషా పరిశీలనము”, పలు ద్రావిడ భాషల్లోని పోలికలను, భేదాల్ని వెల్లడించే “ద్రావిడ భాషా సామ్యములు” గ్రంథాలను రచన చేశారు.

సాహిత్య విమర్శ: సాహిత్య విమర్శకునిగా సీతారామశాస్త్రి పంచకావ్యాల్లో ఒకటైన వసుచరిత్ర, ద్వ్యర్థి కావ్యంగా పేరొందిన హరిశ్చంద్ర నలోపాఖ్యానము తదితర ఉద్గ్రంథాలను ప్రామాణికంగా పరిశీలించి విమర్శరచన చేశారు. చింతామణి విషయ పరిశోధనము, వసుచరిత్ర విమర్శనము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము వంటి గ్రంథాలు ఆయన విమర్శనాశక్తికి గీటురాళ్లుగా నిలుస్తాయి. భారతి ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక మున్నగు వానిలో శాస్త్రిగారి పలు వ్యాసములు ప్రకటింపబడెను. నన్నయ భారత భాగముపై శాస్త్రిగారు తులనాత్మక విమర్స వ్రాసిరి. అహోబల పండితీయమును తమ విమర్శతో ప్రకటింపవలెననుకొనిరి.ఈ విమర్శ వృద్ధత్వముతో మధ్యలోనే ఆగిపోయింది.

1932లో శాస్త్రిగారికి వ్యాకరణాచార్య బిరుదు ప్రధానము జరిగింది. 1947లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు కళాప్రపూర్ణ బిరుదునొసంగిరి. 1956లో ఆంధ్రరాష్ట్ర తృతీయ వార్షికోత్సవ సందర్భమున శాస్త్రిగారికి వేనూట పదార్లు అర్పించి సన్మానించిరి.

తెలుగు వ్యాకరణం అభ్యసించేవారికి 19వ శతాబ్దప్రారంభం నుంచీ చిన్నయసూరి బాలవ్యాకరణం, బహుజనపల్లి సీతారామాచార్యులు గారి ప్రౌఢవ్యాకరణం శరణ్యాలుగా ఉన్నాయి.ఆ వ్యాకరణాలు లోపభూయిష్ఠంగా ఉన్నవని గ్రహించి, సప్రమాణంగా వాటిని వివరిస్తూ వ్యాకరణ జిజ్ఞాసువులకు ఉపయోగకరంగా బాలవ్యాకరణోద్ద్యోతము అనే గ్రంధాన్ని శాస్త్రిగారు రచించారు. పేరుకు ఇది బాలవ్యాకరణోద్ద్యోతము అయినా సమగ్ర సంగ్రహ వ్యాకరణమనే చెప్పాలి.తెలుగు భాషలో చాలా భాగం సంస్కృతపద భూయిష్ఠ మయి ఉన్నది.సంస్కృత భాషలో ప్రవేశం లేకపోతె తెలుగు వాజ్మయాన్ని అర్ధం చేసుకోవటం అసాధ్యం. అలాగే తెలుగు వ్యాకరణాలలో కూడా సంస్కృత వ్యాకరణ పరభాషలే చాలా ఉపయోగింపబడి ఉన్నవి.అందువల్ల ఆంధ్రవ్యాకరణ జిజ్ఞాసువులకు సంస్కృతవ్యాకరణంలో కూడా పవేశం ఉండాలి.ఈ విషయాన్ని బాగుగా గ్రహించిన శాస్త్రిగారు వేరే సంస్కృత వ్యాకరణాలు చదవనక్కర్లేకుండా ఆ లక్షణాలను ఆయా సందర్భాలలో సోదాహరణంగా ఇందులో ఉదహరించారు.తెలుగులోను బాలవ్యాకరణం, ప్రౌఢవ్యాకరణాలనుగాని, సంస్కృత వ్యాకరణాలనుగాని చదవనక్కర్లేకుండా, ఆంధ్రవ్యాకరణ జిజ్ఞాసువులు దీన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే వ్యాకరణ విషయాలన్నీ తెలుసుకోగలుగుతారు. ఇందులో సరళ భాషలో అవి వివరించబడినవి.దీనిని 1959లో తొలిసారి ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు దీని పునరుద్ధరణభారాన్ని వహించి చక్కగా ప్రకటించారు.

గ్రంథరచన: ఆయన వివిధ శాస్త్రాధ్యయనాల ఫలితంగా రచించిన ముఖ్య గ్రంథాల జాబితా:

 • ద్రావిడ భాషా పరిశీలనము
 • ద్రావిడ భాషా సామ్యములు
 • బాలవ్యాకరణోద్ద్యోతము
 • ఆంధ్ర వ్యాకరణ సంహితా సర్వస్వము
 • చింతామణి విషయ పరిశోధనము
 • వసుచరిత్ర విమర్శనము
 • హరిశ్చంద్ర నలోపాఖ్యాన విమర్శనము
 • వైయాకరణ పారిజాతము (1937)
 • కర్ణచరిత్రము
 • మార్గోపదేశిక
 • స్త్రీవివాహవయోనియమనము.
 • వీరసింహుడు (కావ్యము)
 • నన్నయాధర్వణీయము
error: